Friday, September 19, 2025

(ఆంధ్ర మహాభారతమునందలి) ఈశ్వర దండకము

అర్జునుఁడు పరమేశ్వరుని స్తోత్రము సేయుట 

 


శ్రీకంఠ, లోకేశ, లోకోద్భవస్థాన సంహారకారీ, పురారీ, మురారి ప్రియా, చంద్రధారీ, మహేంద్రాది బృందార కానంద సందోహ సంధాయి, పుణ్యస్వరూపా, విరూపాక్ష, దక్షాధ్వరధ్వంసకా: 


నీదైన తత్త్వంబు భేదించి బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన, సర్వేశ్వరా, శర్వ, సర్వజ్ఞ, సర్వాత్మకా, నిర్వికల్ప ప్రభావా, భవానీపతీ: 


నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై తాదిదేవా, మహాదేవ, నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిర్మలజ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధరాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహధ్యాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయా, భవ్య, సేవ్యా, భవా, భర్గ, భట్టారకా, భార్గ వాగస్త్య కుత్సాది నానామునిస్తోత్ర దత్తావధానా: 

.

లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ, భస్మానులిప్తాంగ, గంగాధరా, నీ ప్రసాదంబునన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా, విశ్వకర్తా, సురాభ్యర్చితా. నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ! త్రిలోకైక నాథా! దేవా ! నమస్తే నమస్తే నమః':


నన్నయ భట్టారక విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము లోని అరణ్య పర్వములోనిది. 

తెనుఁగు నుడినందలి తొట్టతొలి దండకము